రాజ్యసభకు ప్రియాంక గాంధీ..!

సాక్షి, న్యూఢిల్లీ : వరుస ఎన్నికల్లో ఘోర ఓటములతో గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. నాయకత్వలేమితో చరిత్రలో ఎన్నడూలేని విధంగా బలహీనపడుతోంది. సోనియా గాంధీ తరువాత పార్టీలో నెంబర్‌2గా పేరొందిన రాహుల్‌ గాంధీ కూడా గత ఎన్నికల్లో పూర్తిగా తేలిపోయారు. పార్టీకి నూతన ఉత్తేజం ఇస్తారనుకున్న రాహుల్‌.. కాంగ్రెస్‌ కంచుకోట అమేథిలోనే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అంతేకాకుండా గత లోక్‌సభ ఎన్నికల్లో దారుణ ఓటమిని రుచిచూశారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ముందు అనూహ్యంగా ఆ పార్టీ తురుపు ముక్క ప్రియాంక గాంధీని తెరపైకి తీసుకువచ్చారు. దీనిలో భాగంగానే కీలకమైన ఉత్తరప్రదేశ్‌ బాధ్యతలను ఆమెకు అప్పగించారు. గత ఏడాది కాలంగా ఆమె పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ.. రాజకీయంగా కీలకంగా ఎదిగారు. పార్టీలోని సీనియర్లను కలుపుకుంటూ.. జూనియర్‌ నేతలకు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యువతను ఆకట్టుకునేందుకు ప్రియాంక గాంధీని రాజ్యసభకు నామినేట్‌ చేస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికితోడు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తమ రాష్ట్రం నుంచి ప్రియాంకను పెద్దల సభకు పంపాలనే డిమాండ్‌ను సోనియా గాంధీ ముందు ఉంచినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.