ట్రాఫిక్ సమస్యతో నగరం విలవిలలాడుతోంది. రోడ్లపై లేస్తున్న దుమ్ము, దూళితో పాటు చెవులు చిల్లులు పడేలా వినిపించే శబ్దాల మధ్య సగటు ప్రయాణికుడి బాధ అంతా ఇంత కాదు. కిక్కిరిసిన నగరంలో మనిషి నిల్చోవడానికి సైతం ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముఖ్యంగా బస్టాప్‌ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇంటికో..ఆఫీసుకో వెళ్లేందుకు బస్టాప్‌కు వచ్చిన వారు నిలుచునేందుకు కూడా స్థలం ఉండటం లేదు. బస్సొస్తే అది ఎంత దూరంలో ఆగుతుందో తెలియని అయోమయ పరిస్థితి. ఎక్కడ ఆపాలో తెలియని గందరగోళంలో బస్సు డ్రైవర్. బస్సు స్టాప్‌ల్లో వెలిసిన తోపుడు బండ్లు, నిలిపిన ఆటోలు, ఇతర వాహనాలు... వెరసి సగటు ప్రయాణికుడికి స్టాపుల్లోనూ నరకమే. దీంతో బస్టాపుల్లో కాకుండా అటుపక్కో ఇటుపక్కో వెళ్లి ఊసూరుమని నిలుచోవాల్సి వస్తోంది. తీరా బస్సు వస్తే అదెక్కడ ఆగుతుందో తెలియదు. ప్రయాణికుడు ముందుకో లేదా వెనక్కో అన్నట్టు పరుగులు పెట్టాల్సిందే. ప్రతినిత్యం ప్రతి స్టాపు వద్ద కనిపించే దృశ్యాలివీ.